పబ్లిక్ టాయిలెట్లతో కరోనా ముప్పు.. శాస్త్రవేత్తల హెచ్చరిక

23-04-2021 Fri 10:03
  • మరుగుదొడ్లలో వాటర్ ఫ్లష్ చేసేటప్పుడు గాల్లోకి అసంఖ్యాకంగా తుంపర్లు
  • వాటిలో కొవిడ్ సహా ఇతర వైరస్‌లు
  • ఐదడుగుల ఎత్తులో 20 సెకన్ల పాటు చక్కర్లు
Covid risk in public Toilets

కొవిడ్ ముప్పు ఇప్పుడు మరో రూపంలోనూ పొంచి ఉంది. పబ్లిక్ టాయిలెట్లలోని గాలితుంపర్ల కారణంగా కరోనా సహా వివిధ రకాల వైరస్‌లు సోకే అవకాశం ఉందని, కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలని ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎక్కువమంది ఉపయోగించే పబ్లిక్ మూత్ర శాలల్లో ఫ్లష్ ద్వారా నీళ్లు కొట్టేటప్పుడు వేల సంఖ్యలో తుంపర్లు గాలిలోకి విడుదలవుతాయని, వాటి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు.

నిజానికి తుమ్మినా, చీదినా, దగ్గినా సూక్షస్థాయి తుంపర్లు గాలిలోకి విడుదలవుతాయని, ఆ సమయంలో వారికి అత్యంత సమీపంలో ఉన్నవారు మాస్కులు ధరించకుంటే వారి శరీంలోకి అవి చేరుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే, మలమూత్రాలు, వాంతుల ద్వారా కూడా వైరస్‌లు బయటకు వస్తాయని, నీటిని ఫ్లష్ చేసేటప్పుడు అవి అసంఖ్యాకంగా గాల్లోకి లేస్తాయని వివరించారు. అలా గాల్లోకి చేరిన తుంపర్లు మూత్రశాలల్లోని గది గోడల్లో ఐదు అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయని, వాటి పరిమాణం, గాలి ప్రసరణను బట్టి 20 సెకన్ల పాటు ప్రయాణం సాగిస్తాయని చెప్పారు.

కాబట్టి, పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించేటప్పుడు అత్యంత జాగురూకతతో ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా మాస్క్ ధరించడం, టాయిలెట్ వినియోగం తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం, నీటిని ఫ్లష్ చేసే సమయంలో తొలుత మరుగుదొడ్డిపై మూత వేయడం వంటివి చేయాలని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సిద్ధార్థ వర్మ వివరించారు.