Telangana: కరోనా విజృంభణ... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 63 కంటెయిన్ మెంట్ జోన్లు!

  • హైకోర్టు అభ్యంతరాల నేపథ్యంలో అధికారుల నిర్ణయం
  • చార్మినార్ పరిధిలో 12 కంటెయిన్ మెంట్ జోన్లు
  • ప్రజలు నిబంధనలను పాటించాలన్న అధికారులు
63 Contraiment Zones in GHMC

తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అభ్యంతరాలను వ్యక్తం చేసిన వేళ, ప్రభుత్వం కీలక నిర్ణయాలను ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 63 కంటెయిన్ మెంట్ జోన్లను ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

చార్మినార్ పరిధిలో 12, సికింద్రాబాద్ పరిధిలో 11, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి పరిధిలో పదేసి చొప్పున కంటెయిన్ మెంట్ జోన్లను జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఈ జోన్లలో 14 జోన్లలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. ఇవన్నీ కూకట్ పల్లి, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఒక ప్రాంతంలో ఐదుకు మించి కరోనా కేసులు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ కట్టడి చర్యలు ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ను పిచికారీ చేయించామని తెలిపారు.

ఇప్పటికే ఈ ప్రాంతాల్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారుల సహకారంతో జ్వరం ఎవరెవరికి ఉందన్న విషయమై సర్వేలు చేయించామని, కొవిడ్-19 టెస్టింగ్ కోసం నమూనాలను సేకరించామని స్పష్టం చేశారు. ఈ కంటెయిన్ మెంట్ జోన్ల పరిధిలో ప్రజలపై ఆంక్షలు ఉంటాయని, ఇదే సమయంలో ఈ ప్రాంతాల నుంచి బయటకు వెళ్లి వచ్చే వారిని ఆపబోమని అన్నారు. కాగా, కరోనా కట్టడి నిమిత్తం రాత్రి 9 గంటల నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News