మీరు నిర్వహించేది పరీక్షలు కాదు.. కోటి మందికి ఇది విషమ పరీక్ష: నారా లోకేశ్

22-04-2021 Thu 21:03
  • విద్యార్థులకు మొండిగా పరీక్షలను నిర్వహించాలనుకుంటున్నారు
  • అందుకే సీఎంను మూర్ఖపు రెడ్డి అని సంబోధించాల్సి వచ్చింది
  • పరీక్షలను రద్దు చేయాలని సీఎంకు లేఖ రాశా
Nara Lokesh fires on AP govt on exams

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు మీరు మొండిగా నిర్వహించాలనుకుంటున్న పరీక్షలు పాసో, ఫెయిలో నిర్ణయించేవి కాదని అన్నారు. 15 లక్షల మంది విద్యార్థులు, పరీక్షల విధుల్లో పాల్గొనే 30 వేల మంది ఉపాధ్యాయులు, లక్షలాది కుటుంబసభ్యులతో కలిపి దాదాపు  కోటి మంది ప్రాణాలకు ఇది విషమ పరీక్ష అని మండిపడ్డారు.

 పరిస్థితి దారుణంగా ఉందని... అందుకే ముఖ్యమంత్రి గారికి తాను లేఖ రాశానని చెప్పారు. లేఖ రాసిన తర్వాత పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం ప్రకటించిందని దుయ్యబట్టారు. అందుకే ముఖ్యమంత్రిని మూర్ఖపు రెడ్డి అని సంబోధించాల్సి వచ్చిందని అన్నారు.

పంతాలు, పట్టింపులకు ఇది సమయం కాదని లోకేశ్ చెప్పారు. 'నన్ను మీ నోటికొచ్చినట్టు మరో అరగంట తిట్టండి... కానీ, పరీక్షలను మాత్రం రద్దు చేసి విద్యార్థులను కాపాడాలని కోరుతున్నా'నని అన్నారు. తన విదేశీ చదువులు, ఫీజుల గురించి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వివరాలను పంపిస్తానని చెప్పారు.

మీరు బాగా చదువుకున్నారు కాబట్టి తాను చెపుతున్న మాటలు మీకు అర్థమై, మరోసారి తాడేపల్లి కాంపౌండ్ కాపీ, పేస్ట్ స్క్రిప్ట్ తో ఆరోపణలు చేయరని ఆశిస్తున్నానని లోకేశ్ వ్యంగ్యంగా అన్నారు. 'పరీక్షలను రద్దుచేసి మేనమామ అనిపించుకుంటాడో... పరీక్షలు పెట్టి కంసుడు లాంటి మేనమామ అనిపించుకుంటాడో మీ మూర్ఖపు రెడ్డి ఇష్టం' అని వ్యాఖ్యానించారు.