బెంగాల్‌లో ముగిసిన ఆరో విడత పోలింగ్‌.. రికార్డు స్థాయిలో పోలింగ్‌

22-04-2021 Thu 19:47
  • కరోనాను సైతం లెక్కచేయని ఓటర్లు
  • నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌లో పాల్గొన్న ప్రజలు
  • 79.08 శాతం పోలింగ్‌ నమోదు
  • అత్యధికంగా నదియా జిల్లాలో 82.70 శాతం పోలింగ్‌
Sixth Phase of polling ended in Bengal

బెంగాల్‌లో ఓటర్లు కరోనాను సైతం లెక్క చేయలేదు. ఎన్నికల సంఘం (ఈసీ) సూచనల మేరకు కరోనా నిబంధనలను పాటిస్తూనే ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చారు. నేడు జరిగిన ఆరో విడత పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 79.08 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు మొత్తం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న 43 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి.

అత్యధికంగా నదియా జిల్లాలో 82.70 శాతం పోలింగ్‌ నమోదైంది. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఎన్నికలు జరిగిన 43 నియోజకవర్గాల్లో 306 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తృణమూల్‌, బీజేపీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశాయి. సంయుక్త మోర్చా పేరిట ఏర్పడిన కూటమిలోని కాంగ్రెస్‌ 12, సీపీఐ(ఎం) 23, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 4, సీపీఐ రెండు స్థానాల్లో పోటీ చేశాయి.