ఉత్కంఠను రేపుతున్న ఫస్టు లుక్ 'విడుదలై'నది!

22-04-2021 Thu 19:19
  • విలక్షణ పాత్రలో విజయ్ సేతుపతి
  • ముఖ్యమైన పాత్రలో కమెడియన్ సూరి
  • 'సత్యమంగళం' ఫారెస్టులో జరుగుతున్న షూటింగ్
  • ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణ        
Vidudalai First Look Releaased
విజయ్ సేతుపతి... విలక్షణమైన నటనకు ఈ పేరు కేరాఫ్ అడ్రెస్. ఇప్పుడు దక్షిణాదిన కొత్తగా ఒక పాత్రను క్రియేట్ చేస్తే, ఆ పాత్ర కోసం ముందుగా పరిశీలించే పేరు విజయ్ సేతుపతి. అంతగా ఆయన తన సహజమైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో తెలుగులోను బాగా పాప్యులర్ అయ్యాడు. ఎంతగా అంటే గతంలో తమిళంలో ఆయన చేసిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేసేంత. అలాంటి విజయ్ సేతుపతి తమిళంలో ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు .. ఆ సినిమా పేరే 'విడుదలై' .. వెట్రిమారన్ ఈ సినిమాకి దర్శకుడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చేతికి సంకెళ్లు వేసి బంధించబడిన సేతుపతి, పోలీస్ స్టేషన్లో పోలీసుల మధ్య కూర్చుని 'టీ' తాగే ఈ పోస్టర్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తెలుగులో ఈ సినిమాను 'విడుదల' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో మరో ప్రధానమైన పాత్రను కమెడియన్ సూరి పోషిస్తున్నాడు. జయమోహన్ రాసిన నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా, ప్రస్తుతం 'సత్యమంగళం' ఫారెస్టులో షూటింగు జరుపుకుంటోంది. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.