'దృశ్యం 2'పై వచ్చింది పుకారేనని తేల్చిన సురేశ్ బాబు!

22-04-2021 Thu 17:58
  • మలయాళంలో హిట్ కొట్టిన 'దృశ్యం 2'
  • తెలుగు కోసం రంగంలోకి దిగిన జీతూ జోసెఫ్
  • రెండు నెలలలోపే రీమేక్ షూటింగు పూర్తి
Suresh babu gave a clarity on Drushyam 2 release in OTT

మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన 'దృశ్యం 2'కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో తెలుగులో వెంకటేశ్ కథానాయకుడిగా ఆ సీక్వెల్ ను రీమేక్ చేస్తున్నారు. మలయాళ మూవీని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ నే తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు నెలలలోపే ఈ సినిమా షూటింగును పూర్తి చేయడం విశేషం. మొదటిభాగంలో తెరపై కనిపించిన ఆర్టిస్టులు అంతా కూడా రెండవ భాగంలోను ఉన్నారు. సురేశ్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయనున్నారనేది ఇంకా చెప్పలేదు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసే పరిస్థితి లేదు కనుక, ఈ సినిమాను ఓటీటీలో రీలీజ్ చేయనున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, అందువలన ఈ సినిమా ఓటీటీ ద్వారానే రానుందనే టాక్ ఊపందుకుంది. దాంతో సురేశ్ బాబు స్పందిస్తూ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని తేల్చేశారు. ఏ విషయమైనా తాము స్వయంగా చెప్పేవరకూ ప్రచారాలు నమ్మవద్దని స్పష్టం చేశారు.