సీక్వెల్ దిశగా 'జాతిరత్నాలు'

22-04-2021 Thu 17:21
  • చిన్నసినిమాగా వచ్చిన 'జాతిరత్నాలు'
  • పెద్ద హిట్ తో భారీ వసూళ్లు
  • సీక్వెల్ పనుల్లో దర్శక నిర్మాతలు
Jathirathnalu Sequel

ఈ మధ్య కాలంలో ఎక్కువమంది నోళ్లలో నానిన పేరు 'జాతిరత్నాలు. స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకి అనుదీప్ దర్శకత్వం వహించాడు. నవీన్ పోలిశెట్టి .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ద్వారా, ఫారియా అబ్దుల్లా కథానాయికగా పరిచయమైంది.

మార్చి 11వ తేదీన విడుదలైన ఈ సినిమా, విడుదలైన ప్రతిప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. చిన్న సినిమాగా థియేటర్లకు వచ్చి, పెద్ద విజయంతో తిరిగి వెళ్లింది. ఈ సినిమా కోసం చేసిన ఖర్చు .. రాబట్టిన వసూళ్లు చూసుకుంటే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అనే అనుకోవాలి.

అలాంటి ఈ సినిమా సీక్వెల్ దిశగా అడుగులు వేయనున్నట్టుగా తెలుస్తోంది. దర్శకనిర్మాతలు సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ లైన్ కూడా ఆలోచించి పెట్టుకున్నారట. మొదటిభాగంలో ముగ్గురు యువకులు బ్రతకడం కోసం పల్లెటూరి నుంచి హైదరాబాద్ వస్తారు. అక్కడ వారు పడే అవస్థలతో కథ ఫన్నీగా సాగిపోతుంది.

ఇక సీక్వెల్లో ఈ ముగ్గురూ తమ కలలు నిజం చేసుకోవడం కోసం అమెరికా పోతారట. అక్కడ వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే కథ. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.