ఢిల్లీకి పూర్తి కోటా ఆక్సిజన్ ఇవ్వండి: కేంద్రాన్ని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

22-04-2021 Thu 16:29
  • 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను వెంటనే సరఫరా చేయండి
  • ఆక్సిజన్ ట్యాంకర్లకు పూర్తి భద్రతను కల్పించండి
  • మా ఆదేశాలను విస్మరిస్తే క్రిమినల్ చర్యలను చేపడతాం
Delhi HC orders Center to supply fully oxygen quota to Delhi

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పేషెంట్లకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ కూడా ఆసుపత్రుల్లో లభించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీకి ఇవ్వాల్సిన పూర్తి ఆక్సిజన్ కోటా 480 మెట్రిక్ టన్నులను తక్షణమే సరఫరా చేయాలని ఆదేశించింది. సరిపడా ఆక్సిజన్ లేకపోతే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని... ఆక్సిజన్ సరఫరా అంశాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని హెచ్చరించింది.

ఆక్సిజన్ ట్యాంకర్లకు పూర్తి భద్రత కల్పించాలని, మార్గమధ్యంలో ఆ వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అత్యవసర ప్రాతిపదికన ఆక్సిజన్ ట్యాంకర్లను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఢిల్లీకి రప్పించాలని చెప్పింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఢిల్లీకి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. తమ ఆదేశాలను పాటించకపోతే క్రిమినల్ చర్యలను చేపడతామని హెచ్చరించింది.