ఉస్మానియా వర్సిటీ డిగ్రీ ఫస్టియర్‌ పరీక్షలు ర‌ద్ద‌యిన‌ట్లు వార్త‌లు.. ఫేక్ అని చెప్పిన అధికారులు

22-04-2021 Thu 12:51
  • సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే వార్త‌ల‌ను న‌మ్మొద్దు
  • మేము ప్ర‌క‌టిస్తేనే న‌మ్మాలి
  • ప‌రీక్ష‌ల ర‌ద్దు, పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్‌పై నిర్ణ‌యం తీసుకోలేదన్న వర్సిటీ 
 Osmania University postpones all exams not cancels

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో అన్ని యూనివ‌ర్సిటీ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌లు పూర్తిగా ర‌ద్ద‌య్యాయంటూ సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తోన్న వార్త‌లు విద్యార్థుల‌ను అయోమ‌యానికి గురి చేస్తున్నాయి.
 
ఉస్మానియా వర్సిటీ పరిధిలో నిర్వ‌హించాల్సిన‌ డిగ్రీ ఫస్టియర్‌ పరీక్షలు ర‌ద్ద‌యిన‌ట్లు, దీంతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండానే విద్యార్థులను సెకండియ‌ర్‌కు ప్రమోట్‌ చేస్తున్నట్లు ఓ న‌కిలీ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా విజృంభ‌ణ నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యూనివ‌ర్సిటీ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుందంటూ అస‌త్య వార్త‌లు వ‌చ్చాయి.

వీటిపై ఓయూ అధికారులు స్పందించి ఆ వార్త‌ల‌ను ఖండించారు. డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేయడంపై తాము ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేద‌ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివ‌రించారు. తాము అధికారికంగా ప్ర‌క‌ట‌న చేస్తేనే ఇటువంటి వార్త‌ను న‌మ్మాల‌ని, సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తోన్న‌ ఫేక్‌ న్యూస్‌ను నమ్మకూడదని సూచించారు.