రంభ అభిమానిగా జగపతిబాబు .. ఆమె కటౌట్స్ పై స్పెషల్ సాంగ్!

22-04-2021 Thu 12:50
  • చిత్రీకరణ దశలో 'మహాసముద్రం'
  • విభిన్నమైన పాత్రలో జగపతిబాబు
  • నో చెప్పిన రకుల్ .. కాజల్ .. శ్రుతి
Special song in Mahasamudram with Rambha cutouts

తెలుగు తెరపై గ్లామరస్ హీరోయిన్ గా రంభ కొంతకాలం పాటు ఏలేసింది. దబ్బపండులా కుర్రాళ్లకి కనువిందు చేసిన రంభ, వివాహమైన తరువాత సినిమాలకు దూరమైంది. ఒకటి రెండు ఐటమ్ సాంగ్స్ లో ఆ మధ్య మెరిసిన రంభ, ఆ తరువాత వాటికి కూడా నో చెప్పేసింది. అందువల్లనే ఈ సారి ఆమె కటౌట్స్ పై స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించారట .. అదీ 'మహాసముద్రం' సినిమా కోసం. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ .. సిద్ధార్థ్ కథానాయకులుగా నటిస్తుండగా, వాళ్ల సరసన అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు.


ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉందట .. దానిని స్టార్ హీరోయిన్ కాంబినేషన్లో చిత్రీకరిస్తే బాగుంటుందని అజయ్ భూపతి భావించాడట. అందుకోసం ఆయన కాజల్ .. రకుల్ .. శ్రుతి హాసన్ లతో సంప్రదింపులు జరిపాడని అంటున్నారు. వాళ్లంతా కూడా నో చెప్పారట. దాంతో జగపతిబాబు పాత్రకు ఆయన రంభకి అభిమాని అనే చిన్న అంశాన్ని జోడించి, ఆమె సినిమాల్లోని కటౌట్స్ పై స్పెషల్ సాంగ్ ను లాగించేశారట. రంభ కటౌట్ల మధ్య జగపతిబాబు .. శర్వానంద్ పై ఈ సాంగ్ నడుస్తుందన్న మాట. ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు. హీరోయిన్లకు కోట్ల రూపాయలు కుమ్మరించడం కంటే, కటౌట్లతో కానిచ్చేసే పనేదో బాగానే ఉంది కదూ!