మరోసారి పవన్ ను ఒప్పించిన దిల్ రాజు!

22-04-2021 Thu 12:06
  • 'వకీల్ సాబ్'తో దక్కిన హిట్
  • పవన్ కి తిరుగులేని రీ ఎంట్రీ
  • పవన్ కి అడ్వాన్స్ ఇచ్చిన దిల్ రాజు  
Dil Raju is doing another project with Pavan Kalyan

సురేశ్ బాబు .. అల్లు అరవింద్ ల తరువాత ఆ స్థాయిలో ఒక నిర్మాతగా దిల్ రాజు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. నిర్మాత అంటే డబ్బులు ఇచ్చేసి .. ఖర్చు చేస్తూ ఉంటే చూసేవాళ్లు కాదని వీరంతా నిరూపించారు. కథలో .. కథనంలో .. చిత్రీకరణ సమయంలో వీరంతా భాగస్వాములు అవుతుంటారు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందనే విషయంలో క్లారిటీ తీసుకుంటూ ఉంటారు. ఎంత చిన్న సినిమా అయినా అందులో ఎంత విషయం ఉందనేది దిల్ రాజు వెంటనే పట్టేస్తారు. అలాంటి దిల్ రాజు ఎంతోమంది హీరోలతో సినిమాలు నిర్మించారు.

అయితే చాలాకాలంగా పవన్ తో అనుకున్న ప్రాజెక్టులు పక్కలకి వెళుతూ వచ్చాయి. మొత్తానికి పవన్ తో సినిమా చేయాలనే తన ముచ్చటను ఆయన 'వకీల్ సాబ్' తో తీర్చుకున్నారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో, పవన్ మళ్లీ ఈ బ్యానర్లో చేయడానికి సిద్ధమవుతున్నాడట.

 మంచి కథతో .. మంచి డైరెక్టర్ తో కలుస్తానని చెప్పిన దిల్ రాజు, ఆయనకి అడ్వాన్స్ కూడా అందజేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం క్రిష్ .. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న పవన్, ఆ వెంటనే హరీశ్ శంకర్ - సురేందర్ రెడ్డి లతో చేయనున్నాడు. ఆ తరువాతనే దిల్ రాజు ప్రాజెక్టు ఉంటుందన్న మాట.