Corona Virus: సమర్థవంతంగా పనిచేస్తున్న టీకాలు.. తీసుకున్నవారిలో కేవలం 0.04 శాతం మందికే వస్తున్న కరోనా

very very less people prone to corona infection after taking two doses of vaccine
  • టీకా తీసుకున్నవారిలో కరోనా కేసులు చాలా తక్కువ
  • కొవాగ్జిన్‌ తీసుకున్న వారిలో కేవలం 0.04 శాతం మందికే కరోనా
  • కొవిషీల్డ్‌ తీసుకున్న వారిలో 0.02-0.03 శాతం మందికి కొవిడ్‌
  • పూర్తిగా నివారించలేకపోయినా.. మరణం నుంచి తప్పిస్తున్న టీకా
కరోనాను నిరోధించే టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కొంతమంది మహమ్మారి బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర ప్రభుత్వం కీలక గణాంకాలు వెలువరించింది. టీకా తీసుకున్న తర్వాత చాలా తక్కువ శాతం మందిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందని వెల్లడించింది.

‘‘టీకా తీసుకున్న 10 వేల మందిలో ఇద్దరి నుంచి నలుగురు మాత్రమే కరోనా బారిన పడుతున్నారు. ఈ సంఖ్య చాలా చాలా తక్కువ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ తెలిపారు.

93,56,436 మంది భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా తొలి డోసు తీసుకోగా.. కేవలం 4,208 మంది మాత్రమే కరోనా బారిన పడ్డారని గణాంకాలు తెలిపాయి. ఇక 17,37,178 మంది రెండు డోసులు తీసుకోగా.. 695 మందిలో మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు వెల్లడించాయి. అంటే టీకా తీసుకున్న తర్వాత కేవలం 0.04 శాతం మందికి మాత్రమే కరోనా సోకుతున్నట్లు తెలుస్తోంది.

ఇక సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాకు సంబంధించిన గణాంకాలు ఇంకా ఆశాజనకంగా ఉన్నాయి. 10,03,02,745 మందికి కొవిషీల్డ్‌ తొలిడోసు ఇవ్వగా.. 0.02 శాతం అంటే 17,145 మంది మాత్రమే కరోనా బారిన పడ్డారు. ఇక 1,57,32,754 మంది రెండో డోసు తీసుకోగా.. 0.03 శాతం అంటే 5,014 మందిలో కరోనా నిర్ధారణ అయ్యింది.

ఈ గణాంకాలు చూస్తే వ్యాక్సిన్లు సురక్షితమన్న విషయం స్పష్టమవుతోందని ప్రభుత్వం తెలిపింది. పైగా పైన తెలిపిన గణాంకాలు కొవిడ్‌ రోగులతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వైద్యారోగ్య సిబ్బందిని కూడా కలుపుకొని లెక్కించినవని పేర్కొంది. వారిని మినహాయిస్తే టీకా తీసుకున్న వారిలో కొవిడ్‌ బారినపడుతున్న వారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే ప్రతిఒక్కరూ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే.. టీకా తీసుకోవాలని సూచించింది.
Corona Virus
corona vaccine
COVID19
Covaxin
Covishield

More Telugu News