యాంటీవైరల్‌ డ్రగ్‌ ఫ్యాబిఫ్లూను ఉచితంగా పంచుతున్న గంభీర్‌

21-04-2021 Wed 20:29
  • తన నియోజకవర్గ ప్రజలకు మాత్రమే
  • కరోనా చికిత్సలో వినియోగిస్తున్న ఫ్యాబిఫ్లూ
  • ఆధార్‌ చూపించి తీసుకోవాలని విజ్ఞప్తి
  • ఢిల్లీలో కరోనా విలయతాండవం
Gambhir distributing Fabiflu for free

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి వైద్యారోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఆక్సిజన్‌, ఔషధాలు, పడకల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అప్రమత్తమైన తూర్పు ఢిల్లీ నియోజకవర్గ ఎంపీ, బీజేపీ నేత గౌతమ్ గంభీర్‌ ఉచితంగా ఫ్యాబిఫ్లూ అనే యాంటీవైరల్‌ డ్రగ్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ డ్రగ్‌ను కొందరు వైద్యులు స్వల్ప నుంచి ఓ మోతాదు లక్షణాలున్న కరోనా బాధితుల చికిత్సలో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో దీని కొరత భారీగా ఉంది.

ఈ నేపథ్యంలో గంభీర్‌ దీన్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. తన నియోజకవర్గ ప్రజలు ఎంపీ కార్యాలయం నుంచి ఈ ఔషధం పొందాలని తెలిపారు. ఆధార్‌ కార్డు, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ చూపించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దీన్ని పొందొచ్చన్నారు.