కరోనా ఎఫెక్ట్‌: భారత ప్రయాణికులపై ఫ్రాన్స్‌ ఆంక్షలు!

21-04-2021 Wed 20:08
  • 10 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి
  • కరోనా ఉద్ధృతి నేపథ్యంలోనే అని వివరణ
  • భారత్‌ను రెడ్ లిస్ట్‌లో పెట్టిన బ్రిటన్‌
  • భారత విమానాలను రద్దు చేసిన హాంకాంగ్‌, న్యూజిలాండ్‌
  • భారత్‌కు ప్రయాణం రద్దు చేసుకోవాలని అమెరికా హెచ్చరిక
France mandates 10 day quarantine for Indian passengers

భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌ ఆ దిశగా చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులందరికీ 10 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేయనున్నామని ప్రకటించింది. వివిధ దేశాల్లో కరోనా వేరియంట్లు ప్రబలుతున్న నేపథ్యంలోనే కఠిన ఆంక్షలు విధించాల్సి వస్తోందని తెలిపింది. ఈ క్రమంలో బ్రెజిల్‌, చిలీ, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపైనా ఫ్రాన్స్‌ ఆంక్షలు అమలు చేస్తోంది

ఫ్రాన్స్‌తో పాటు బ్రిటన్‌, న్యూజిలాండ్‌, హాంకాంగ్‌, అమెరికా సైతం భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో ఉన్నాయి. బ్రిటన్‌ భారత్‌ను రెడ్‌ లిస్ట్‌లో చేర్చగా.. అమెరికా తన పౌరులకు భారత ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది. మరోవైపు హాంకాంగ్‌, న్యూజిలాండ్‌ భారత విమానాలను పూర్తిగా నిషేధించాయి.