యశోదా ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్

21-04-2021 Wed 19:59
  • కరోనా వైరస్ బారిన పడిన కేసీఆర్
  • ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్న సీఎం
  • సీటీ స్కాన్ కోసం యశోదా ఆసుపత్రికి రాక   
KCR may go to Yashoda hospital for health check up

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులోని యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన కరోనా వైరస్ బారిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలో ఉన్న తన ఫామ్ హౌస్ లోనే ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే సీటీ స్కాన్, ఇతర సాధారణ వైద్య పరీక్షల కోసం ఆయన ఆసుపత్రికి వచ్చారు. దాదాపు గంటన్నర పాటు ఆసుపత్రిలోనే ఆయన వుంటారు. సీఎంతో పాటు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు.

కేసీఆర్ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సమక్షంలో యశోదా ఆసుపత్రి వైద్యులు ఆయనకు పరీక్షలను నిర్వహించనున్నారు. కరోనా బారిన పడిన తర్వాత ఆసుపత్రికి కేసీఆర్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పరీక్షల అనంతరం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లాలా? లేక ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలా? అనే విషయాన్ని వైద్యులు నిర్ణయించనున్నారు.