Corona Virus: ‘బహుశా ఇదే నా చివరి గుడ్‌మార్నింగ్‌’.. పోస్ట్‌ చేసిన 36 గంటల్లోనే కరోనాతో మరణించిన డాక్టర్‌

  • కన్నీరు పెట్టిస్తున్న మనీషా జాదవ్‌ పోస్ట్‌
  • మనీషా క్షయ వ్యాధి నిపుణురాలు 
  • మృత్యువును ముందే పసిగట్టిన వైద్యురాలు
  • అందరూ జాగ్రత్తగా ఉండాలని చివరి సందేశం
May be last good morning posted a doctor and dies after 36 hrs

కరోనా ఎన్నో హృదయవిదారక ఘటనల్ని కళ్లకు కడుతోంది. ఎందరో అభాగ్యులు కళ్ల ముందే విలవిల్లాడుతూ మరణిస్తున్నా.. ఏమీ చేయలేని దయనీయ స్థితి. కొందరైతే ఆత్మీయుల కడచూపునకు కూడా నోచుకోలేకపోతున్నారు. మరికొందరు కన్నవారి అంత్యక్రియలు జరిపి తమ తుది బాధ్యతను నెరవేర్చలేకపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా మిగుల్చుతున్న కన్నీటి వ్యథలు అన్నీఇన్నీకావు. ఈ కోవకు చెందినదే ముంబయికి చెందిన మనీషా జాదవ్‌ గాథ.

మనీషా జాదవ్‌ ఓ క్షయ వ్యాధి నిపుణురాలు. సెవ్రీ టీబీ ఆసుపత్రిలో చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆమె కరోనా బారిన పడ్డారు. అయితే, ఆమె తన మృత్యువును ముందే పసిగట్టారు. గత ఆదివారం ఫేస్‌బుక్ వేదికగా ఇక తాను బతకకపోవచ్చుననే సంకేతం ఇచ్చారు. ‘‘బహుశా ఇదే నా చివరి గుడ్‌ మార్నింగ్‌. ఇక ఈ వేదికపై నేను మిమ్మల్ని మళ్లీ కలవకపోవచ్చు. అందరూ జాగ్రత్త. శరీరానికే మరణం ఉంటుంది. ఆత్మకు కాదు. ఆత్మ ఎప్పటికీ జీవించే ఉంటుంది’’ అని సందేశం ఉంచారు. ఇలా పోస్ట్‌ చేసిన 36 గంటల్లోపే ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈ సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇలా అనేక మంది డాక్టర్లు కరోనా సంక్షోభంలో తాము ఎదుర్కొంటున్న అనుభవాలను సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్‌ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు పడుతున్న కష్టాలతో పాటు కరోనా బాధితుల వ్యథలను పంచుకుంటున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలా ముంబయికి చెందిన మరో వైద్యురాలు డాక్టర్ తృప్తి గిల్డా పెట్టిన పోస్ట్‌ ప్రతిఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఆసుపత్రుల్లో దయనీయ పరిస్థితులు ఉన్నాయని.. బాధితుల కష్టాలను చూసి ఏమి చేయాలో తోచని దయనీయ స్థితిలో ఉన్నామని తీవ్ర ఆవేదనతో వెల్లడించారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారికి ఎవరూ అతీతులు కాదని.. వచ్చిన తర్వాత పరిస్థితులు ఎవరూ ఊహించలేరని తెలిపారు.

More Telugu News