స్పుత్నిక్ కరోనా వ్యాక్సిన్ ధరను ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్!

21-04-2021 Wed 19:30
  • స్పుత్నిక్ ఒక్కో డోసు ధర రూ. 750
  • వ్యాక్సిన్ మొత్తాన్ని ప్రైవేట్ మార్కెట్ కే తరలిస్తామన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్
  • టీకా ఇక్కడ తయారు చేయడం ప్రారంభమైన తర్వాత ధర తగ్గొచ్చన్న కంపెనీ ఎండీ
Sputnik vaccine each dose costs Rs 750 says Dr Reddys

మన దేశంలో ఇప్పటి వరకు సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కోవిడ్ వ్యాక్సిన్ ను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అందుబాటులోకి తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ. 750 వరకు ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. మే-జూన్ నెలలో దిగుమతుల ద్వారా లక్ష వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు.

ప్రైవేట్ మార్కెట్ కోసమే తాము వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటున్నామని జీవీ ప్రసాద్ చెప్పారు. వ్యాక్సిన్ మొత్తాన్ని ప్రైవేట్ మార్కెట్ కే తరలిస్తామని తెలిపారు. ప్రపంచ మార్కెట్ కు తగ్గట్టుగానే భారత్ లో కూడా వ్యాక్సిన్ ధర ఉండాలని తమ భాగస్వామి సంస్థ కోరిందని... వ్యాక్సిన్ గ్లోబల్ ధర 10 డాలర్లుగా ఉందని... మన కరెన్సీలో కూడా అదే ధరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. వ్యాక్సిన్ ఇక్కడే తయారు చేయడం ప్రారంభించిన తర్వాత ప్రైవేట్ మార్కెట్ తో పాటు పబ్లిక్ మార్కెట్ కు సరఫరా చేస్తామని... అప్పుడు వ్యాక్సిన్ ధర కూడా తగ్గుతుందని తెలిపారు. కరోనా మ్యుటెంట్లపై కూడా స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందని చెప్పారు.