'ఐకాన్' హీరో బన్నీ కాదట!

21-04-2021 Wed 18:15
  • 'ఐకాన్' ప్రాజెక్టుపై ఆసక్తిని చూపని బన్నీ
  • దిల్ రాజు అసహనం
  • మరో హీరోకి ఛాన్స్
  • త్వరలోనే రానున్న ప్రకటన   

Bunny is not hero for Icon movie

అల్లు అర్జున్ హీరోగా నిర్మాత దిల్ రాజు .. దర్శకుడు వేణు శ్రీరామ్ ఆ మధ్య 'ఐకాన్' సినిమాను ఎనౌన్స్ చేశారు. అయితే అనుకున్నట్టుగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తరువాత అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాను చేయడం ..  వెంటనే 'పుష్ప' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఈ లోగా దిల్ రాజు - వేణు శ్రీరామ్ కలిసి 'వకీల్ సాబ్' ప్రాజెక్టును పట్టాలెక్కించడం .. ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయడం జరిగిపోయాయి. వేణు శ్రీరామ్ కి పెద్ద హిట్ పడడంతో, అల్లు అర్జున్ 'ఐకాన్' చేయడానికి అంగీకరించవచ్చని దిల్ రాజు అనుకున్నాడట.

అయితే మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్టు పట్ల అంతగా ఆసక్తిని చూపని అల్లు అర్జున్, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడట. ఇటీవల ఒక వేదికపై తమ తదుపరి సినిమాగా 'ఐకాన్' ఉంటుందని దిల్ రాజు స్పష్టం చేశాడు కూడా. అయినా ఆ విషయాన్ని గురించి అల్లు అర్జున్ పెద్దగా స్పందించలేదట. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టును మరో హీరోతో సెట్ చేసుకోవాలనే ఆలోచనకి దిల్ రాజు వచ్చాడని అంటున్నారు. ఈ కరోనా ఉద్ధృతి నుంచి బయటపడిన తరువాత ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నాడని చెబుతున్నారు.