భారీ పారితోషికం అందుకోనున్న 'ఉప్పెన' డైరెక్టర్?

21-04-2021 Wed 17:44
  • 'ఉప్పెన'లా వచ్చిపడిన వసూళ్లు
  • నిర్మాతలకు భారీస్థాయిలో లాభాలు
  • కొత్తకథపై బుచ్చిబాబు కసరత్తు
Huge Remuneration for Uppena Director
ఇటీవల కాలంలో వచ్చిన ప్రేమకథల్లో 'ఉప్పెన' చెప్పుకోదగిన స్థాయిలో నిలిచింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఒక వైపున జాలరిగూడెం .. మరో వైపున సముద్రం .. ఆ మధ్యలో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఈ సినిమా నుంచి ' నీ కన్ను నీలి సముద్రం' .. 'జల జల జల పాతం నువ్వు' అనే పాటలు వదిలిన తరువాత, థియటర్లను చుట్టుముట్టే క్షణాల కోసం కుర్రాళ్లు ఎదురుచూశారు. సినిమా విడుదల కాగానే థియేటర్లను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఫలితంగా ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది.

భారీస్థాయిలో లాభాలు రావడం వలన నిర్మాతలు దర్శకుడు బుచ్చిబాబుకు ఒక 'బెంజ్ కారు'ను బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు తమ బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం బుచ్చిబాబు అందుకుంటున్న పారితోషికం 8 కోట్లు అనే టాక్ వినిపిస్తోంది. రెండవ సినిమాకే ఈ స్థాయి పారితోషికం అందుకోనున్న అతి తక్కువమంది దర్శకులలో బుచ్చిబాబు ఒకరు అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు కొత్త కథపై కసరత్తు చేస్తున్నాడట. ఇందులో హీరో హీరోయిన్లు ఎవరనేది త్వరలోనే తెలియనుంది.