రామ్ మూవీతో జెనీలియా రీ ఎంట్రీ!

21-04-2021 Wed 17:24
  • తెలుగులో అల్లరి కథానాయికగా పేరు
  • చెప్పుకోదగిన సినిమా 'బొమ్మరిల్లు'
  • చివరి చిత్రం రానాతో చేసిన 'నా ఇష్టం'    
Genilia Re entry in Ram movie

రామ్ .. జెనీలియా అనగానే 'రెడీ' సినిమాలో ఈ జోడీ చేసిన అల్లరి గుర్తుకు వస్తుంది.  శ్రీను వైట్ల దర్శకత్వంలో 2008లో వచ్చిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకుంది. అలాంటి ఈ జోడీ మరోసారి తెరపై కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి ఆమె రామ్ సరసన హీరోయిన్ కాదు .. ఒక ముఖ్యమైన పాత్రను చేయబోతోందట. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది. చాలాకాలం తరువాత జెనీలియా రీ ఎంట్రీ ఇవ్వనుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

తెలుగులో జెనీలియాకు మంచి మంచి హిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా 'ఢీ' .. 'రెడీ' .. 'బొమ్మరిల్లు' సినిమాలు ఆమె కెరియర్లో చెప్పుకోదగినవిగా కనిపిస్తాయి. వివాహమైన తరువాత ఆమె కొంత గ్యాప్ తీసుకుంది. ఆ తరువాత హిందీలో ముఖ్యమైన పాత్రల్లో అలా కనిపించి మాయమవుతూ వస్తోంది. రానా జోడీగా 2012లో చేసిన 'నా ఇష్టం' సినిమానే తెలుగులో ఆమె చివరి చిత్రం.

ఆ తరువాత ఆమె టాలీవుడ్ వైపు చూడలేదు. మళ్లీ తొమ్మిదేళ్ల తరువాత ఆమె పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.. జెనీలియాను ఏ సినిమా కోసం సంప్రదించారనేదే తెలియాల్సి ఉంది. అందమైన అల్లరిపిల్ల అనిపించుకున్న జెనీలియా రీ ఎంట్రీ నిజమే అయితే, అది ఆమె అభిమానులకు శుభవార్తే!