ప్రభాస్ సినిమాపై కరోనా ఎఫెక్ట్.. ఆగిపోయిన షూటింగ్!

21-04-2021 Wed 16:57
  • అందమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్'
  • ప్రభాస్ మేకప్ మేన్ కు కరోనా
  • మేకప్ మేన్ తిరిగి రావడం కోసం ఎదురుచూస్తున్న చిత్ర యూనిట్
Prabhas Radhe Shyam movie stopped due to Corona

ప్రభాస్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రాధేశ్యామ్'. యూవీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందమైన ప్రేమకథగా, ప్యాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగాన్ని ఇటలీలోనే చిత్రీకరించారు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదలై ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.

మరోవైపు ఈ సినిమా షూటింగ్ పై కరోనా ప్రభావం పడింది. ప్రభాస్ మేకప్ మేన్ కరోనా బారిన పడటంతో షూటింగ్ ఆగిపోయిందని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ పాత తరం లుక్ లో కనిపించాలి. దీనికి మేకప్ చాలా ముఖ్యం. అయితే, మేకప్ మేన్ కు కరోనా సోకడంతో షూటింగ్ నిలిచిపోయింది. మేకప్ మేన్ తిరిగా రావడం కోసం యూనిట్ ఎదురుచూస్తోంది.

మరోవైపు ఈ సినిమాలో భాగ్యశ్రీ, సచిన్ ఖడేకర్, మురళీశర్మ, కృనాల్ రాయ్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్టంరాజు కీలక పాత్రను పోషిస్తున్నారు.