నాసిక్‌లోని ఆసుప‌త్రిలో ఘోర ప్ర‌మాదం.. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీక్‌.. 11 మంది మృతి

21-04-2021 Wed 15:07
  • ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ నింపుతుండ‌గా  ఘ‌ట‌న‌
  • వెంటిలేట‌ర్‌పై ఉన్న రోగులకు అంద‌ని ఆక్సిజ‌న్
  • మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం
Oxygen Tank Leaks Outside Maharashtra Hospital

మ‌హారాష్ట్ర, నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్‌ ఆసుప‌త్రిలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆసుప‌త్రి స‌మీపంలో ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ నింపుతుండ‌గా ఒక్క‌సారిగా అది లీకైంది. దీంతో ఆ ఆసు‌ప‌త్రిలో వెంటిలేట‌ర్‌పై ఉన్న రోగుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది.

ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీక్ కారణంగా రోగుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను ఆపేయాల్సి వ‌చ్చింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం వ‌ల్లే రోగులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన అధికారులు, సిబ్బంది ఆక్సిజ‌న్ లీకేజీని ఆపేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు.

ఆక్సిజ‌న్ ట్యాంక్ లీక్ అయిన స‌మ‌యంలో ఆసుప‌త్రిలో 171 మంది రోగులు ఉన్నారు. కొంద‌రు రోగుల‌ను ఇత‌ర ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు  విచార‌ణ‌కు ఆదేశించారు.