టాటా గ్రూపుపై మోదీ ప్రశంసలు

21-04-2021 Wed 14:51
  • కరోనాతో మెడికల్ ఆక్సిజన్ కొరత
  • 24 కంటైనర్ల లిక్విడ్ ఆక్సిజన్ ను దిగుమతి చేసుకుంటున్న టాటా గ్రూపు 
  • టాటా సేవలు వెలకట్టలేనివని మోదీ ప్రశంస
PM Modi praises TATA group

సమాజ సేవకు టాటా గ్రూపు ఎంత ప్రాధాన్యతను ఇస్తుందో అందరికీ తెలిసిందే. తమకు వచ్చిన లాభాల్లో దాదాపు 50 శాతాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకే టాటా గ్రూపు వినియోగిస్తుంటుంది. తాజాగా కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన తరుణంలో కూడా టాటా గ్రూపు తన దాతృత్వాన్ని చాటుకుంది. కరోనా కొరతను అధిగమించేందుకు తమ వంతుగా 24 లిక్విడ్ ఆక్సిజన్ క్రయోజనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకుంటున్నట్టు ప్రకటించింది.

నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత టాటా గ్రూపు ఈ ప్రకటనను వెలువరించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ గట్టి చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు కరోనా కట్టడిని ఎదుర్కొనేందుకు తాము తమ వంతు కృషి చేస్తామని తెలిపింది.

టాటా గ్రూపు నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ప్రధాని మోదీ స్పందించారు. మల్టీ నేషనల్ కంపెనీ అయిన టాటా గ్రూపు తమ టాటా ట్రస్టు ద్వారా చేస్తున్న సేవలు వెలకట్టలేనివని మోదీ ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో వారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని ప్రశంసించారు.