ఢిల్లీవాసులను భయపెడుతున్న డెంగీ.. రికార్డు స్థాయిలో కేసుల నమోదు

21-04-2021 Wed 14:41
  • 1996 నుంచి ప్రతి సంవత్సరం డెంగీ బారిన ఢిల్లీ
  • ఈ ఏడాది ఇప్పటి వరకు 13 కేసులు
  • జాగ్రత్తగా ఉండాలంటున్న అధికారులు
13 Dengue Cases Recorded In Delhi

కరోనా కేసులతో వణికిపోతున్న ఢిల్లీని ఇప్పుడు మరో భయం వేధిస్తోంది. నగరంలో డెంగీ బారినపడుతున్న రోగుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. రికార్డు  స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. జనవరి 1 నుంచి ఈ  నెల 17 వరకు నమోదైన డెంగీ కేసుల సంఖ్య 2018లో ఇదే సమయంలో నమోదైన కేసులను అధిగమించింది. గత వారం రోజుల్లో కొత్తగా నలుగురు వ్యక్తులు డెంగీ బారినపడ్డారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13కు పెరిగింది. 2018లో అత్యధికంగా 12 మంది డెంగీ బారినపడ్డారు.

 మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మంది నగరంలో డెంగీకి చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు.1996 నుంచి ప్రతి సంవత్సరం ఢిల్లీలో జులై-నవంబరు మధ్య డెంగీ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. డెంగీ అనేది వ్యాక్సిన్ లేని వైరల్ వ్యాధి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నివాస పరిసరాల్లో దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, గతేడాది డిసెంబరు 5 నాటికి ఢిల్లీలో దాదాపు 1000 డెంగీ కేసులు నమోదయ్యాయి.