పల్లెలకు కొవిడ్‌ వ్యాపిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి: ఈట‌ల‌

21-04-2021 Wed 14:26
  • ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాలి
  • రాత్రి కర్ఫ్యూ వ‌ల్ల‌ కేసులు కాస్త‌యినా తగ్గుతాయి
  • వ్యాక్సిన్‌ వేసే కేంద్రాల సంఖ్యను పెంచాం  
  • 45 ఏళ్లు నిండిన వారంద‌రికీ వ్యాక్సిన్‌ ఇచ్చేలా చర్యలు
no remdesivir shortage in ts etela

పల్లెలకు కొవిడ్ వ్యాపిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని తెలంగాణ మంత్రి ఈట‌ల రాజేందర్ హెచ్చరించారు. ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాలని సూచించారు. కరీంనగర్‌ జిల్లా తుమ్మనపల్లిలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... రాత్రి కర్ఫ్యూ అమ‌ల్లోకి తీసుకురావ‌డంతో కేసులు కాస్త‌యినా తగ్గుతాయ‌ని అన్నారు.

రాష్ట్రంలో ఇప్ప‌టికే వ్యాక్సిన్‌ వేసే కేంద్రాల సంఖ్యను పెంచామని, భ‌విష్య‌త్తులో అవసరమైతే మ‌రిన్ని పెంచుతామని వివ‌రించారు. 45 ఏళ్లు నిండిన వారంద‌రికీ వ్యాక్సిన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. రాష్ట్రంలోని  ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరామ‌ని తెలిపారు. ఆక్సిజన్‌ కొరత రాకుండా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నార‌ని చెప్పారు.