COVID19: జనవరిలో 734 శాతం పెరిగిన ఆక్సిజన్​ ఎగుమతులు

  • గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ జనవరి దాకా 9 వేల టన్నులు
  • గత ఏడాదంతా 4,500 టన్నుల సరఫరా
  • ఈ ఏడాది ఒక్క జనవరిలోనే 4,500 టన్నుల ఎగుమతి
  • పోయినేడాది జనవరిలో కేవలం 352 టన్నులే విదేశాలకు
India Oxygen Export Rose Over 734 percent In January 2021 vs 2020 Amid Pandemic

ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక చనిపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే, ఈ ఏడాది జనవరిలో మన దేశం నుంచి విదేశాలకు భారీగా ఆక్సిజన్ ఎగుమతి అయింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు భారత్ 9 వేల టన్నులకుపైగా ఆక్సిజన్ ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.

అయితే, గత ఏడాది మొత్తంగా 4,500 టన్నులనే ఎగుమతి చేసిన ప్రభుత్వం.. ఒక్క జనవరిలోనే మరో 4,500 టన్నులకు పైగా ఎగుమతి చేసినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఏడాది జనవరిలో ప్రభుత్వం కేవలం 352 టన్నులే ఎగుమతి చేయగా.. ఈ ఏడాది జనవరిలో దానికి 734 శాతం అధికంగా ఆక్సిజన్ ను విదేశాలకు సరఫరా చేసింది. 2019 డిసెంబర్ లో 538 టన్నులను సరఫరా చేసిన ప్రభుత్వం.. గత ఏడాది డిసెంబర్ లో మాత్రం 308 శాతం అధికంగా 2,193 టన్నులను ఎగుమతి చేసింది.

అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఎగుమతుల లెక్కలను ఇంకా ప్రభుత్వం బయటకు వెల్లడించలేదు. చాలా రాష్ట్రాలు ఆక్సిజన్ కొరత వేధిస్తోందంటూ కేంద్రానికి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కోరాయి. దీంతో అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచేలా రెండ్రోజుల క్రితమే కేంద్రం ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించింది.

More Telugu News