కరోనాతో కన్నుమూసిన ప్రముఖ బెంగాలీ కవి, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత శంఖ ఘోష్

21-04-2021 Wed 14:12
  • ఈ నెల 14న కరోనాతో హోం ఐసోలేషన్‌లోకి
  • 2011లో పద్మభూషణ్, 2016లో జ్ఞాన్‌పీఠ్ అవార్డులు అందుకున్న ఘోష్
  • ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న చాంద్‌పూర్‌లో జననం
Bengali Poet Shankha Ghosh Dies Battling Covid

కరోనా బారినపడి హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రముఖ బెంగాలీ రచయిత, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత శంఖ‌ఘోష్ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. ఈ నెల 14న కరోనా బారినపడిన ఆయన అప్పటి నుంచి కోల్ కతాలో హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆరోగ్యం క్షీణించడంతో ఘోష్ కొన్ని నెలల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.

ఆదిమ్ లటా-గుల్మోమే, ముర్ఖా బారో సామాజిక్ నే తదితర పుస్తకాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2011లో పద్మభూషణ్, 2016లో జ్ఞాన్‌పీఠ్ అవార్డును అందుకున్నారు. 1977లో ఆయన రాసిన బాబర్ ప్రార్థన గ్రంథానికి సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఘోష్ రాసిన పలు పుస్తకాలు ఇంగ్లిష్, హిందీ సహా పలు భాషల్లోకి అనువాదమయ్యాయి.

ఘోష్‌కు భార్య ప్రతీమ, కుమార్తెలు సేమంతి, స్రవంతి ఉన్నారు. ఘోష్ చాలా సున్నితమైన వ్యక్తి అని, కానీ ఆయన కలానికి మాత్రం పదునెక్కువని ప్రముఖ సాహిత్యకారుడు సుబోధ్ సర్కార్ పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఘోష్ 6 ఫిబ్రవరి 1932న ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న చాంద్‌పూర్‌లో జన్మించారు.