అంతు చూస్తా అని హూంకరించిన ఉమా.. పరార్ అవడమేంటి?: విజయసాయిరెడ్డి

21-04-2021 Wed 13:11
  • ఖబడ్దార్, తెగ్గోస్తా, తొక్కేస్తానంటివేనంటూ ఎద్దేవా
  • అసహ్యంగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి దాక్కోవడమేంటంటూ కామెంట్
  • మైలవరం నవ్వుతోందని ఎద్దేవా
  • నిర్దోషిత్వం నిరూపించుకోవాలని సవాల్
VijayaSai Reddy Sattires on Devineni over Video Morphing Case
సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుపై రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నేత విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. వీడియో మార్ఫింగ్ కేసులో ఇంటికి వెళ్లిన పోలీసుల కళ్లుగప్పి దేవినేని పారిపోయారని ఎద్దేవా చేశారు.

‘‘ఖబడ్దార్, తెగ్గోస్తా, తొక్కేస్తా, అంతు చూస్తా అని హూంకరించిన ఉమా.. పరార్ అవడమేంటి? ఫోన్ స్విచ్ఛాప్ చేసి దాక్కోవడమేంటి అసహ్యంగా’’ అంటూ సెటైర్లు వేశారు. మైలవరం నవ్వుతోందని, లొంగిపోయి నిర్దోషిత్వం నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా కొన్ని రోజుల క్రితం సీఎం జగన్ పై దేవినేని ఉమ ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం అది ఫేక్ అని తేలుస్తూ.. ఒరిజినల్ వీడియోలను పోస్ట్ చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.