సాయితేజ్ 'రిపబ్లిక్' రిలీజ్ వాయిదా?

21-04-2021 Wed 12:00
  • పొలిటికల్ డ్రామాగా 'రిపబ్లిక్'
  • పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ
  • ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ జూన్ 4
Sai Tej Republic Movie Postponed
సాయితేజ్ నుంచి ఈ మధ్య వచ్చిన 'సోలో బ్రతుకే సో బెటర్' ఓ మాదిరిగా ఆడింది. దాంతో ఆయన ఆ తరువాత సినిమా విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్నాడు. దేవ కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' సినిమా చేశాడు. ఇది పొలిటికల్ డ్రామాగా రూపొందింది. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు - రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషించారు. రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాను జూన్ 4వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున థియేటర్లకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం విపరీతంగా ఉండటంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చేనెలలో థియేటర్లకు రానున్న కొన్ని సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. ఆ బాటలోనే 'రిపబ్లిక్' నడిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.