'ఆకాశం నీ హద్దురా' దర్శకురాలితో మహేశ్ బాబు?

21-04-2021 Wed 11:06
  • తమిళనాట సుధ కొంగరకి మంచి క్రేజ్
  • ఆమె కథకి మహేశ్ ఓకే చెప్పాడనే టాక్
  • ఆల్రెడీ రెండు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టేసిన మహేశ్  
Mahesh Babu Upcoming Film with Sudha Kongara
ప్రస్తుతం 'సర్కారు వారిపాట' చిత్రంలో నటిస్తున్న మహేశ్ బాబు.. దీని తర్వాత నటించే తదుపరి చిత్రాల గురించి రోజుకో అప్ డేట్ వస్తూనే ఉంది. ఆ ప్రాజెక్టులన్నీ ఎప్పుడు పట్టాలెక్కుతాయనే విషయాన్ని పక్కన పెడితే, అభిమానుల్లో ఒకరకమైన ఉత్సాహం మాత్రం వెల్లువెత్తుతోంది. తాజాగా ఆయన సుధ కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది.

దర్శకురాలిగా తమిళంలో సుధా కొంగరకి మంచి పేరు ఉంది. ఇటీవల తమిళంలో సూర్య హీరోగా ఆమె తెరకెక్కించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా విజయంతో పాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది. అలాంటి ఆమె ఇటీవల మహేశ్ బాబును కలిసి ఒక కథ వినిపించారట. ఆ కథలోని కొత్తదనం నచ్చడంతో వెంటనే ఆయన ఓకే చెప్పాడని అంటున్నారు.

అయితే ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదు. ఎందుకంటే, ముందుగా మహేశ్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న 'సర్కారువారి పాట' పూర్తిచేయాలి. ఆ తరువాత ప్రాజెక్టులుగా త్రివిక్రమ్ .. రాజమౌళి సినిమాలు లైన్లో ఉన్నాయి. అంటే ఓ రెండేళ్ల తరువాతనే ఈ సినిమా ఉండే అవకాశం ఉందనుకోవాలి.