నితిన్ 'మాస్ట్రో' మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్!

21-04-2021 Wed 10:43
  • అంధుడి పాత్రలో నితిన్
  • దర్శకుడిగా మేర్లపాక గాంధీ
  • కీలకమైన పాత్రలో జిషు సేన్ గుప్తా
  • జూన్ 11వ తేదీన విడుదల  
Nithin Maestro movie new poster released
చాలా తక్కువ కాలంలో కెరియర్ పరంగా ఎక్కువ ఒడిదుడుకులను చవిచూసిన యంగ్ హీరోగా నితిన్ కనిపిస్తాడు. ఫలితం ఎలాంటిదైనా ఆయన తన దూకుడును కొనసాగించడం విశేషం. 'భీష్మ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఈ ఏడాది వరుస సినిమాలను థియేటర్లకు వదులుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన 'చెక్' పరాజయంపాలు కాగా, ఆ తరువాత వచ్చిన 'రంగ్ దే' ఫరవాలేదనిపించుకుంది. ఇక ఆయన తాజా చిత్రంగా 'మాస్ట్రో' రూపొందుతోంది. కొంతకాలం క్రితం హిందీలో సక్సెస్ అయిన 'అంధాదున్' సినిమాకి ఇది రీమేక్.

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ జోడీగా నభా నటేశ్ నటిస్తోంది. ఈ రోజున 'శ్రీరామనవమి' కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ ను వదిలారు. స్కూటర్ ను నభా నటేశ్ నడుపుతూ ఉండగా.. అంధుడి పాత్రను పోషిస్తున్న నితిన్ ఆమె వెనక కూర్చుని ఉన్నాడు. పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. తమన్నా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, జిషు సేన్ గుప్తా పాత్ర కీలకం కానుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, జూన్ 11న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.