హరీశ్ శంకర్ తో మరోసారి మాస్ మహారాజ్!

21-04-2021 Wed 10:13
  • రవితేజ 'షాక్'తో హరీశ్ శంకర్ పరిచయం
  • ఇద్దరి కాంబినేషన్లో 'మిరపకాయ్' హిట్
  • మరోసారి ఓకే చెప్పిన రవితేజ    
Raviteja Upcoming Movie with Harish Shankar
తెలుగులో వినాయక్ తరువాత మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా హరీశ్ శంకర్ కనిపిస్తాడు. తన సినిమాల్లో మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా ఆయన చూసుకుంటాడు. ఇంతకుముందు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. హ్యాట్రిక్ హిట్ అందుకుని మాంఛి దూకుడు మీదున్న హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ తో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ రావడం వలన, ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే క్రిష్ .. సాగర్.కె చంద్ర దర్శకత్వంలోని సినిమాలను పూర్తిచేసిన తరువాతనే, హరీశ్ శంకర్ తో సెట్స్ పైకి పవన్ వస్తాడు. అందుకు దాదాపు ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అందువలన ఈ లోగా మరో సినిమాను చేయాలని హరీశ్ శంకర్ నిర్ణయించుకున్నాడట. ఆయన ఒక కథను రవితేజకు వినిపించడం .. అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయని అంటున్నారు. హరీశ్ శంకర్ పరిచయమైందే రవితేజ 'షాక్' సినిమాతో. తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో 'మిరపకాయ్' హిట్ ఉంది. మొత్తానికి మరో మాస్ మసాలా మూవీ రానుందన్న మాట!