TSRTC: నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో రాత్రి ఏడు గంటల వరకే సిటీ బస్సుల చివరి ట్రిప్

  • రాత్రి 9 గంటలకల్లా డిపోలకు చేరుకోనున్న బస్సులు
  • ఉదయం ఆరు గంటలకు తొలి ట్రిప్
  • రాత్రి పూట ప్రయాణించేవారు విధిగా టికెట్ చూపించాలి
  • రైలు సర్వీసులు, జిల్లా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు యథాతథం
Hyderabad City Buses Ends Their Trip At Evenig 7PM

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఇకపై రాత్రి ఏడు గంటలకే సిటీ బస్ సర్వీసుల చివరి ట్రిప్‌ను ముగించాలని నిర్ణయించింది. రాత్రి 9 గంటలకల్లా ట్రిప్‌లు ముగించుకుని బస్సులు డిపోలకు చేరే ఉద్దేశంతో ట్రిప్‌లను కుదించింది.

అలాగే, తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలయ్యే తొలి ట్రిప్‌లను ఆరు గంటలకు మార్చింది. అయితే, జిల్లా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అవి యథాతథంగానే నడుస్తాయని అధికారులు తెలిపారు. ఒకవేళ తొమ్మిది గంటల సమయంలో ప్రయాణికులు బస్టాండ్లలో దిగితే కనుక ఇంటికి వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్‌లు వినియోగించుకోవచ్చు. అయితే, ఇందుకు విధిగా టికెట్ చూపించాల్సి ఉంటుంది.

కర్ఫ్యూ ఉన్నా దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు టికెట్‌ను చూపించి బస్టాండ్లకు చేరుకోవచ్చు. మరోవైపు, రాత్రిపూట బయలుదేరే బస్సులు తగినంతమంది ప్రయాణికులు ఉంటేనే బయలుదేరుతాయని, లేదంటే రద్దవుతాయని అధికారులు తెలిపారు. ఈ విషయంలో ప్రయాణికులకు ముందే సమాచారం ఇస్తామని, రద్దయితే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని వివరించారు. కాగా, కర్ఫ్యూతో నిమిత్తం లేకుండా రైళ్లు యథావిధిగా నడవనున్నాయి.

More Telugu News