జార్జ్‌ఫ్లాయిడ్ మృతి కేసులో తీర్పు.. డెరెక్‌ను దోషిగా తేల్చిన కోర్టు

21-04-2021 Wed 08:19
  • గతేడాది మే 25న పోలీసు అధికారి కర్కశత్వానికి ఫ్లాయిడ్ బలి
  • నరహత్యగా అభివర్ణించిన కోర్టు
  • త్వరలో డెరెక్‌కు శిక్ష ఖరారు
  • అమెరికాలో న్యాయం జరిగిన రోజుగా అభివర్ణించిన కమలా హారిస్
  • బాధిత కుటుంబాన్ని వైట్‌హౌస్‌కు పిలిపించి మాట్లాడిన బైడెన్, హారిస్
US Ex Cop Derek Chauvin convicted of George Floyds murder
అమెరికాలో సంచలనం సృష్టించి అల్లర్లకు కారణమైన ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. గతేడాది మే 25న పోలీసు అధికారి డెరెక్ చేతిలో ఫ్లాయిడ్ మరణించాడు. ఫ్లాయిడ్ మెడను మోకాలితో తొక్కిపెట్టడంతో ఊపిరి ఆడక ఆయన ప్రాణాలు కోల్పోయాడు. తనకు ఊపిరి ఆడడం లేదని చెప్పినా డెరెక్ కాలు తీయకపోవడానికి సంబంధించిన వీడియో అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు మాజీ అధికారి డెరెక్ చౌవిన్‌ను కోర్టు తాజాగా దోషిగా ప్రకటించింది. ఫ్లాయిడ్ హత్యను సెకండ్, థర్డ్ డిగ్రీ హత్య, నరహత్యగా పేర్కొన్న న్యాయస్థానం శిక్షను త్వరలో ఖరారు చేయనుంది. కోర్టు తీర్పు తర్వాత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తీర్పు సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున కోర్టు వద్ద గుమికూడడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.

ఫ్లాయిడ్ హత్య సమయంలో దోషి డెరెక్‌తోపాటు ఉన్న మిగతా ముగ్గురు పోలీసులపైనా అభియోగాలు నమోదు కాగా, ఆగస్టు నుంచి వారిపై విచారణ జరగనుంది. కోర్టు తీర్పు అనంతరం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ అమెరికాలో న్యాయం జరిగిన రోజుగా అభివర్ణించారు. బాధిత జార్జ్ కుటుంబ సభ్యులను అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వైట్ హౌస్‌కు పిలిపించి మాట్లాడారు.