45 ఏళ్లు పైబడిన సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నాం: చిరంజీవి

20-04-2021 Tue 20:53
  • చిరంజీవి వీడియో సందేశం
  • సినీ పరిశ్రమను కాపాడుకుంటామని వెల్లడి
  • నెల రోజుల పాటు వ్యాక్సిన్ డ్రైవ్
  • గురువారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం  
  • అపోలో 24/7 ద్వారా వ్యాక్సిన్
Chiranjeevi says corona vaccine free for Tollywood cine workers and film journalists
గతేడాది కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో టాలీవుడ్ సినీ కార్మికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) సంస్థ ఏర్పాటైన సంగతి తెలిసిందే. సీసీసీ ఏర్పాటులో మెగాస్టార్ చిరంజీవి క్రియాశీలక పాత్ర పోషించారు. తాజాగా, సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు కరోనా వ్యాక్సిన్ ఇస్తామని చిరంజీవి వెల్లడించారు. ఓ వీడియో ద్వారా ఆయన తన సందేశం వెలువరించారు. 45 ఏళ్లకు పైబడిన సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు వ్యాక్సిన్లను ఉచితంగానే అందిస్తామని చెప్పారు.

గురువారం నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం అమలు చేస్తామని వివరించారు. అపోలో 24/7 సహకారంతో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నామని, సినీ కార్మికులు, పాత్రికేయులు వారికి సంబంధించిన అసోసియేషన్లలో పేర్లు నమోదు చేయించుకోవాలని చిరంజీవి సూచించారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అపోలో ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందిస్తారని వెల్లడించారు.

కార్మికులకే కాదు, 45 ఏళ్లకు పైబడిన వారి జీవిత భాగస్వాములకు కూడా వ్యాక్సిన్ ఉచితం అని స్పష్టం చేశారు. కరోనా భూతం నుంచి టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కాపాడుకునేందుకే ఈ కార్యాచరణ తీసుకువచ్చామని, కార్మికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.