నా జీవితంలో ఇప్పటికీ నేను నమ్మలేని నిజం అదే!: ఇంద్రజ

20-04-2021 Tue 18:58
  • సౌందర్య అప్పటికే స్టార్ హీరోయిన్
  • నాకు అంతా కొత్తగా ఉండేది
  • సౌందర్య మేకప్ టిప్స్ చెప్పేది 
Indraja remembers Soundarya
తెలుగు తెరకి పరిచయమైన నిన్నటి తరం అందమైన కథానాయికలలో ఇంద్రజ ఒకరు. పేరుకు తగినట్టుగానే ఇంద్రలోకం నుంచి దిగివచ్చిందా? అన్నంత గ్లామర్ గా ఆమె ఉండేవారు. కథానాయికగా ఆమెకి మంచి సక్సెస్ లు .. మంచి గుర్తింపు ఉన్నాయి. సౌందర్య .. ఆమని వంటి కథానాయికలతో ఆమె కలిసి పనిచేశారు.

 తాజా ఇంటర్వ్యూలో ఆమె సౌందర్యను గుర్తు చేసుకున్నారు. "సౌందర్య గారితో కలిసి నేను కొన్ని సినిమాలు చేశాను. నాకు పరిచయమయ్యే నాటికే సౌందర్య పెద్ద హీరోయిన్. నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు అంతా కొత్తగానే ఉండేది. నన్ను పలకరిస్తే తప్ప నేను ఎవరితోనూ మాట్లాడేదానిని కాదు. సెట్లో ఉన్నంత సేపు చేయనున్న సీన్ గురించే ఆలోచించేదానిని.

సౌందర్య కూడా అలాగే యాక్టింగ్ మూడ్ లోనే ఉండేది. ఆమె కూడా సెట్లో కబుర్లు చెబుతూ కూర్చోవడం నేను ఎప్పుడూ చూడలేదు. అప్పుడప్పుడు మాత్రం స్కిన్ ను ఎలా కాపాడుకోవాలనే విషయంలో నాకు సూచనలు ఇస్తూ ఉండేది. నిజంగా ఆమె చాలా మంచి వ్యక్తి. నా జీవితంలో ఇప్పటికీ నేను నమ్మలేని నిజం ఏదైనా ఉందంటే అది సౌందర్య చనిపోవడమే. అది ఒక 'కల' అయితే బాగుండునని నేను ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను" అని చెప్పుకొచ్చారు.