Sharmila: షర్మిల మద్దతు కోరుతూ లేఖ రాసిన అమరావతి మహిళా జేఏసీ

  • అమరావతి కోసం కొనసాగుతున్న పోరాటం
  • షర్మిల మద్దతు కోరిన మహిళా జేఏసీ
  • స్వయంగా వచ్చి ఆహ్వానిస్తామన్న సుంకర పద్మశ్రీ
  • కనీసం పత్రికా ప్రకటన ఇచ్చినా చాలని వెల్లడి
  • ఉద్యమానికి మేలు చేసినవారవుతారని వ్యాఖ్యలు
Amaravathi women JAC wrote Sharmila seeking support

తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించేందుకు సన్నద్ధమవుతున్న వైఎస్ షర్మిలకు అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ లేఖ రాశారు. తెలంగాణ నిరుద్యోగుల తరఫున ఇటీవల షర్మిల చేసిన పోరాటంలో ఎంత న్యాయం ఉందో, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 491 రోజులుగా తాము చేస్తున్న ఆందోళనలోనూ అంతే న్యాయం ఉందని పద్మశ్రీ పేర్కొన్నారు.

 నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తున్న షర్మిల గాయపడిందన్న వార్త విని తాము ఎంతో బాధపడ్డామని, కానీ షర్మిలను పోలీసులు ఒక్కసారే గాయపరిచారని, కానీ తమను ఏడాది నుంచి జగన్ ప్రభుత్వంలోని పోలీసులు ప్రతిరోజు అవమానించి గాయపరుస్తున్నారని వివరించారు. ఆ విషయం మీకు తెలియంది కాదు అని షర్మిలను ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు.

"తెలంగాణలో మీ పోరాటానికి మీ వదిన భారతీరెడ్డి ఆధ్వర్యంలోని సాక్షి మీడియా ఏ విధంగా కవరేజీ ఇవ్వడంలేదో, ఇక్కడ కూడా అదే విధంగా వ్యవహరిస్తోంది. సాక్షి మీడియా అమరావతి పోరుకు కవరేజీ ఇవ్వకపోగా తీవ్రస్థాయిలో వ్యతిరేక కథనాలు రాస్తోంది. ఈ అంశంలో మనం ఇరువురం సాక్షి మీడియా బాధితులమే.

మీపై జరిగిన దాడికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ మీ తల్లి వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఆమె డిమాండ్ లో అర్థముంది... తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. కానీ ఇక్కడ మాపై అనేక రూపాల్లో జరుగుతున్న దాడులకు మీ అన్న జగన్ ప్రభుత్వం కూడా దిగొచ్చి సమాధానం చెప్పాలి. ఈ విషయంలో విజయమ్మ కూడా జగన్ కు ఓ మాట చెబితే తెలంగాణలో మీరు చేస్తున్న పోరాటానికి విశ్వసనీయత ఏర్పడుతుంది.

షర్మిల గారూ... అమరావతి కోసం మేం చేస్తున్న ఆందోళనకు మీ మద్దతు కావాలి. తెలంగాణ కోడలిగా మీరు అక్కడ పోరాటం చేస్తున్నట్టే, ఆంధ్రా ఆడబిడ్డగా వచ్చి మేం చేస్తున్న పోరాటానికి స్వయంగా మద్దతు పలకాలని కోరుతున్నాం. మిమ్మల్ని ఆహ్వానించేందుకు అమరావతి మహిళా జేఏసీ ప్రతినిధి బృందం మీ వద్దకు రావాలని అనుకుంటున్నాం. మీ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నాం. ఒకవేళ కరోనా పరిస్థితుల్లో మీరు రాలేకపోతే అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు పత్రికా ప్రకటన ఇచ్చినా చాలు... మా పోరాటానికి మేలు చేసినవారవుతారు. మీ సమాధానం కోసం ఎదురుచూస్తుంటాం" అని సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు.

More Telugu News