గ్వాలియర్ లో దారుణం.. కరోనా పేషెంట్ పై అత్యాచారయత్నం!

20-04-2021 Tue 17:19
  • వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న 59 ఏళ్ల మహిళ
  • అత్యాచార యత్నం చేసిన వార్డుబోయ్ 
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Ward boy rape attempt on Corona patient
కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా కామాంధులు తమ తీరును మార్చుకోవడం లేదు. కరోనా పేషెంట్లపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిపై ఓ వార్డు బోయ్ అత్యాచారయత్నం చేశాడు.

వివరాల్లోకి వెళ్తే, కరోనా బారిన పడిన 59 ఏళ్ల మహిళ నగరంలోని లోటస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, ఆమెకు వెంటిలేటర్ సాయంతో చికిత్స చేస్తున్నారు. ఆమె చికిత్స పొందుతున్న వార్డులోనే పని చేస్తున్న వార్డుబోయ్ వివేక్ లోధి (25) అమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకుతూ, అత్యాచారయత్నం చేశాడు. తీవ్ర భయాందోళనకు గురైన ఆమె అలారం మోగించడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిన ఘటనపై ఆ తర్వాత ఆమె తన కుటుంబసభ్యులకు సమాచారం అందించింది.

బాధితురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో వివేక్ పై పోలీసులు సెక్షన్ 376,354 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆమెకు హాస్పిటల్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా చికిత్సను ఆపేసిందని... వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తమ హాస్పిటల్ పరువు పోయిందని భావిస్తోన్న హాస్పిటల్ యాజమాన్యం... తమను ఇబ్బందులకు గురి చేస్తోందని అంటున్నారు.