Russia: రష్యా యుద్ధ విమానాల దాడి.. 200 మంది ఉగ్రవాదుల హతం!

  • సిరియాలోని ఉగ్రవాద క్యాంపుపై దాడి
  • 24 వాహనాలు కూడా ధ్వంసం
  • 2015 నుంచి సిరియాలో సైనిక చర్యలను నిర్వహిస్తున్న రష్యా
Russia conducts air strikes on Syrian terrorists camps

ఉగ్రవాదులపై రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. సిరియాలోని  ఉగ్రవాద శిక్షణ క్యాంపుపై రష్యా యుద్ధ విమానాలు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో సుమారు  200 మంది ఉగ్రవాదులు చనిపోయారని రష్యా సైన్యం ప్రకటించింది. ఉగ్రవాదులకు చెందిన 24 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని పేర్కొంది.

ఈ సందర్భంగా అడ్మిరల్ అలక్సందన్ కార్పొవ్ మాట్లాడుతూ, సిరియా నది సమీపంలో ఉగ్రవాద క్యాంపుపై దాడి చేసినట్టు తెలిపారు. ఈ క్యాంపులో పేలుడు పదార్థాలు తయారు చేసినట్టు కూడా గుర్తించినట్టు చెప్పారు.

ఇలాంటి క్యాంపుల్లో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని... సిరియా అధికారుల అధీనంలో లేని ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయని రష్యా మిలిటరీ తెలిపింది. రష్యా సైన్యం 2015 నుంచి సిరియాలో సైనిక చర్యలను నిర్వహిస్తోంది. సిరియా అధ్యక్షుడు అసద్ బాషర్ కు మద్దతుగా పని చేస్తోంది. ఇద్దరు రష్యా సైనికులను చంపినట్టు ఇటీవల ఐసిస్ తెలిపింది. దీనికి ప్రతీకారంగానే రష్యా వైమానిక దళం దాడులకు పాల్పడినట్టు సమాచారం.

More Telugu News