Corona Virus: ఐదు నగరాల్లో లాక్ డౌన్ కి ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు.. నిరాకరించిన యోగి సర్కారు!

  • లక్నో, ప్రయాగ్‌రాజ్‌, వారణాసి, కాన్పూర్‌, గోరఖ్‌పూర్‌ నగరాల్లో లాక్ డౌన్ కి ఆదేశాలు  
  • ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదన్న సర్కారు  
  • కఠిన ఆంక్షలు విధించేందుకు అంగీకారం
  • కరోనాపై పోరులో వీఐపీ కల్చర్‌కు స్వస్తి పలకాలన్న హైకోర్టు
Allahabad High Court Ordered to impose Lockdown in 5 cities

కరోనా కట్టడిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై అలహాబాదు హైకోర్టు మొట్టికాయలు వేసింది. మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న లక్నో, ప్రయాగ్‌రాజ్‌, వారణాసి, కాన్పూర్‌, గోరఖ్‌పూర్‌ నగరాల్లో ఈరోజు రాత్రి నుంచి ఏప్రిల్‌ 26 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని సోమవారం ఆదేశించింది. కానీ, అందుకు యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయితే, కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలు అమలు చేస్తామని స్పష్టం చేసింది.

అంతకుముందు హైకోర్టు యోగి సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచిస్తూ వైరస్‌ వ్యాప్తికి కారణమవుతుంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తాము చూస్తూ ఊరుకోలేమని వ్యాఖ్యానించింది. అలాగే కరోనా చికిత్స అందించే క్రమంలో వీవీఐపీ సంస్కృతికి స్వస్తి పలకాలని హితవు పలికింది. లేదంటే వైద్య వసతులు కొందరికే పరిమితమై మొత్తం ఆరోగ్య వ్యవస్థే కుప్పకూలుతుందని వివరించింది. ఉత్తరప్రదేశ్‌లో వీఐపీల సిఫార్సు మేరకే కరోనా బాధితులకు పడకలు కేటాయించడం, రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని అందించడం, ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేయడం జరుగుతోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే హైకోర్టు ఇలా స్పందించింది.

అలాగే అత్యవసర సేవలు మినహా పైన పేర్కొన్న నగరాల్లో ఏప్రిల్‌ 26 వరకు అన్ని సంస్థల్ని మూసివేయాలని హైకోర్టు సూచించింది. ఇప్పటికే ఫిక్స్‌ అయిన పెళ్లిళ్లు మినహా కొత్త వివాహాలను అనుమతించొద్దని స్పష్టం చేసింది. హోటళ్లు రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించింది. విద్య, మతపరమైన సంస్థల్ని సైతం మూసివేయాలని తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్లను గుర్తించాలని తెలిపింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించింది.

More Telugu News