Corona Virus: తయారీ సంస్థల వద్ద రాష్ట్రాలు నేరుగా టీకాలు కొనుక్కోవచ్చు: స్పష్టం చేసిన కేంద్రం

  • 3వ విడత వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలు విడుదల 
  • 18 ఏళ్లు నిండిన వారందరికీ మే 1 నుంచి టీకా
  • ప్రైవేటు ఆస్పత్రులూ టీకాలు కొనుగోలు చేయవచ్చు
  • 50 శాతం టీకాలు తప్పనిసరి కేంద్రానికి ఇవ్వాలి
  • మిగిలినవి మాత్రమే విక్రయించాలని నిబంధన
Now states can buy vaccines directly from Manufacturers

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం.. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా తయారీ సంస్థల వద్దే టీకాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ముందుగా నిర్ధారించిన ధరల మేరకు సంస్థలు రాష్ట్రాలకు టీకాలు విక్రయించవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇతర పరిశ్రమలు సొంతంగా టీకాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే, వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు వారు తయారు చేసిన టీకాల్లో 50 శాతం కచ్చితంగా కేంద్రానికి అందించాలి. మిగిలిన 50 శాతం టీకాల్ని మాత్రమే బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని షరతు విధించింది.

దేశవ్యాప్తంగా కరోనా విచ్చలవిడిగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగా మూడో విడత టీకా పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. నేడు వివిధ వర్గాలతో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహమ్మారి నివారణే లక్ష్యంగా విస్తృత స్థాయి చర్చలు జరిపారు. తదనంతరమే ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.

More Telugu News