రెమ్‌డెసివిర్‌ ప్రాణాల్ని కాపాడే దివ్యౌషధం కాదు: స్పష్టం చేసిన కేంద్రం

19-04-2021 Mon 19:19
  • దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం
  • రెమ్‌డెసివిర్‌కు భారీ డిమాండ్‌
  • వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలన్న కేంద్రం
  • అనవసరంగా వినియోగిస్తే అనైతికతేనన్న ప్రభుత్వం
Remdesivir is not a life saving drug

కరోనా చికిత్సలో వినియోగిస్తున్న యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమ్‌డెసివిర్‌ ప్రాణాల్ని కాపాడే దివ్యౌషధమేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఔషధాన్ని అనవసరంగా, ఎలాంటి సహేతుకత లేకుండా వినియోగించడం అనైతిక చర్య అవుతుందని తెలిపింది.

రెమ్‌డెసివిర్‌ అత్యవసర వినియోగం కింద వాడేందుకు అనుమతించిన ప్రయోగాత్మక ఔషధం మాత్రమేనని తెలిపింది. ఆసుపత్రిలో చేరిన వారికి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని ఇవ్వాలని పేర్కొంది. మోతాదు లక్షణాలుండి ఆక్సిజన్‌ అవసరమైన కరోనా బాధితులకు మాత్రమే దీన్ని అందజేయాలని స్పష్టం చేసింది. ఇంట్లో చికిత్స పొందుతున్నవారు ఎట్టిపరిస్థితుల్లో దీన్ని తీసుకోవద్దని తెలిపింది.

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. అయితే, కొంతమంది ప్రజలు కరోనా భయంతో ముందు జాగ్రత్తగా దీన్ని తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగే పాజిటివ్‌గా తేలిన ప్రతిఒక్కరూ రెమ్‌డెసివిర్‌ ఇవ్వాలని వైద్యులను కోరుతున్న ఉదంతాలూ ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఔషధానికి భారీ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలు లేకుండా ఈ మందును తీసుకోవడం శ్రేయస్కరం కాదని కేంద్రం స్పష్టం చేసింది.