21 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ఆఫ్రికా 'నల్ల కలువ'

19-04-2021 Mon 19:10
  • బాల్యంలో దేశాన్ని, కుటుంబాన్ని వీడిన నోవా స్టీవెన్స్
  • కెనడాలో బంధువుల ఇంట ఎదిగిన వైనం
  • మిస్ యూనివర్స్ కెనడా అందాల పోటీల్లో గెలుపు
  • ఇథియోపియాలో కుటుంబ సభ్యులతో కలయిక
  • భావోద్వేగభరితురాలైన నోవా
Miss Universe Canada Nova Stevens reunites with her family in Ethiopia after twenty one years

నిత్యం అంతర్యుద్ధాలు, తీవ్ర దుర్భిక్షం, దారుణమైన అనారోగ్య పరిస్థితులు, పేదరికం... వీటన్నింటికి చిరునామా ఆఫ్రికా దేశాలు. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు అత్యంత దయనీయం. ఇలాంటి దేశాల్లో తమ పిల్లలు పెరగాలని ఏ తల్లిదండ్రులు మాత్రం కోరుకుంటారు? అందుకే నోవా స్టీవెన్స్ అనే అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు ఐదేళ్ల వయసులోనే కెనడా పంపించివేశారు. ఆఫ్రికాలోని కల్లోల భరిత పరిస్థితుల్లో కంటే కెనడాలో బంధువుల వద్దే క్షేమంగా ఉంటుందని భావించారు.

ఇప్పుడా నోవా స్టీవెన్స్ 26 ఏళ్ల ప్రాయానికి వచ్చింది. అంతేకాదు, మిస్ యూనివర్స్ కెనడా-2020 అందాల పోటీల్లో ఈ ఆఫ్రికా నల్ల కలువ విజేతగా నిలిచింది. తన కుటుంబం ఇథియోపియా దేశంలో నివసిస్తోందని బంధువుల ద్వారా తెలుసుకున్న ఆమె వెంటనే కెనడా నుంచి బయల్దేరింది. ఇథియోపియా చేరుకుని, తల్లి, ఇతర కుటుంబ సభ్యులను కలుసుకున్న క్షణాన నోవా స్టీవెన్స్ భావోద్వేగాలు వర్ణనాతీతం.

అయిన వాళ్లను కలుసుకునేందుకు 21 సంవత్సరాలు పట్టిందని, కుటుంబాన్ని వీడి ఒంటరిగా ఉండడం ఏమంత సులభం కాదని నోవా పేర్కొంది. తన కుటుంబమే తన బలం అని భావిస్తున్నానని వివరించింది. రెండు దశాబ్దాల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్న ఆనందం ఓవైపు, వారు ఇప్పటికీ అత్యంత దుర్భర పరిస్థితుల్లోనే బతుకుతున్నారన్న బాధ మరోవైపు ఆమెను కమ్మేశాయి. ఏదేమైనా తన కుటుంబ సభ్యులను కలవడం ఓ కల నిజమైనట్టుగా ఉందని, అందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నోవా పేర్కొంది.

నోవా స్టీవెన్స్ 1994లో కెన్యాలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు దక్షిణ సూడాన్ కు చెందినవారు. నోవాను వారు బాల్యంలోనే కెనడా పంపించేశారు. అక్కడే బంధువుల వద్ద పెరిగిన నోవా 15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటికి వచ్చేసి సొంతంగా బతకడం ప్రారంభించింది. న్యూయార్క్ నగరం చేరుకుని మోడలింగ్ చేస్తూ, ఎంతో గుర్తింపు పొందింది. కెనడాలో నిర్వహించిన మిస్ యూనివర్స్ కెనడా అందాల పోటీల్లో కిరీటం దక్కించుకుంది.