బాబాయ్ తరువాత అబ్బాయ్ తోనే బోయపాటి సినిమా?

19-04-2021 Mon 18:43
  • కొత్త దర్శకుడితో కల్యాణ్ రామ్
  • 'రా' ఏజెంట్ గా కొత్త లుక్
  • బోయపాటికి గ్రీన్ సిగ్నల్
Boyapati next movie with kalyan Ram

బోయపాటి సినిమాల్లో హీరో పవర్ఫుల్ గా ఉంటాడు .. పట్టరాని కోపంతో ఉంటాడు. విలన్ గ్యాంగును అరుపులతో భయపెడతాడు .. ఆయుధాలకు పని చెబుతాడు. అలాంటి యాక్షన్ సీన్ లో హీరో చెలరేగిపోతుంటే, మాస్ ఆడియన్స్ ఒక పండగలా చూస్తుంటారు. బోయపాటి నుంచి వాళ్లు ఆ తరహా సీన్లనే ఆశిస్తారు. వాళ్ల అభిరుచికి తగినట్టుగానే బోయపాటి ఆయా సన్నివేశాలను డిజైన్ చేస్తాడు. ఆయన తాజా చిత్రంగా 'అఖండ' రూపొందుతోంది. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తరువాత బోయపాటితో సెట్స్ పైకి వెళ్లే హీరో కల్యాణ్ రామ్ అని తెలుస్తోంది. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. ఆల్రెడీ బోయపాటి కథను వినిపించడం .. కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. ప్రస్తుతం కల్యాణ్ రామ్ .. రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ కథలో ఆయన 'రా' ఎంజెంట్ గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే బోయపాటితో కల్యాణ్ రామ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.