మొయినాబాద్ రిసార్టులో 'అఖండ'

19-04-2021 Mon 18:00
  • భారీ బడ్జెట్ చిత్రంగా 'అఖండ'
  • విభిన్నమైన గెటప్స్ లో బాలయ్య
  • ప్రతినాయకుడి పాత్రలో శ్రీకాంత్
Akhanda shooting in Moinabad resort

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' రూపొందుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన పాత్రల మధ్య గల వైవిధ్యం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా టీమ్ మరింత ఉత్సాహంతో పనిచేస్తోంది.

ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను 'వికారాబాద్' అడవుల్లో చిత్రీకరించారు. బాలకృష్ణ - శ్రీకాంత్ తదితరులు పాల్గొనగా, భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా షూటింగు మొయినాబాద్ లో జరుగుతోంది. అక్కడి రిసార్టులో బాలయ్య -  ప్రగ్యా జైస్వాల్ కాంబినేషన్ లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. బాలకృష్ణగారితో కలిసి నటించే అవకాశం లభించడం తన అదృష్టమనీ, కరోనాకి సంబంధించి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నామని ప్రగ్యా జైస్వాల్ చెప్పింది.