కృష్ణా ట్రైబ్యునల్ లో జరగాల్సిన విచారణ కరోనా కారణంగా వాయిదా

19-04-2021 Mon 17:43
  • తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు
  • ఈ నెల 28 నుంచి 30 వరకు విచారణ
  • కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన ట్రైబ్యునల్
  • ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశాయన్న చైర్మన్
  • తదుపరి విచారణ తేదీలు త్వరలో నిర్ణయిస్తామని వెల్లడి
Corona halts Krishna Tribunal hearing

కరోనా మహమ్మారి మునుపటి మాదిరే ప్రతి అంశంపైనా తన ప్రభావం చూపుతోంది. తాజాగా, కృష్ణా ట్రైబ్యునల్ లో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై జరగాల్సిన విచారణ కూడా కొవిడ్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. ఈ నెల 28 నుంచి 30 వరకు విచారణ జరగాల్సి ఉండగా, ఢిల్లీలో కరోనా ఉద్ధృతంగా ఉన్నందున వాయిదా వేస్తూ కృష్ణా ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ట్రైబ్యునల్ చైర్మన్ లేఖ ద్వారా సమాచారం అందించారు. కరోనా నేపథ్యంలో విచారణ ఇప్పుడు వద్దని రెండు రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయని, ఆ విజ్ఞప్తులను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నామని చైర్మన్ పేర్కొన్నారు. తదుపరి విచారణ తేదీలను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయిస్తామని వెల్లడించారు.