నా జన్మదిన వేడుకలు వద్దు... మీరంతా క్షేమంగా ఉంటే అదే కానుకగా భావిస్తా: చంద్రబాబు

19-04-2021 Mon 17:02
  • రేపు చంద్రబాబు పుట్టినరోజు
  • కరోనా వ్యాప్తి కారణంగా చంద్రబాబు కీలక నిర్ణయం
  • సమావేశాలు నిర్వహించవద్దని టీడీపీ శ్రేణులకు స్పష్టీకరణ
  • భౌతికదూరం పాటిస్తూ సురక్షితంగా ఉండాలని పిలుపు
Chandrababu tells party cadre do not organize his birthday celebrations

ఏప్రిల్ 20న టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు. అయితే, కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఎవరూ తన జన్మదినం సందర్భంగా సమావేశాలు నిర్వహించవద్దని చంద్రబాబు పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.

"నా జన్మదినానికి ఒక ప్రత్యేకత తీసుకువచ్చేందుకు మీరందరూ నిర్వహించే కార్యక్రమాలు అభినందనీయమే. అందుకు మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కానీ ఇప్పటి పరిస్థితుల్లో కరోనా నుంచి రక్షణ పొందడం చాలా అవసరం. అందుకే నా జన్మదినం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని టీడీపీ నేతలను, కార్యకర్తలను కోరుతున్నాను. దయచేసి అందరూ భౌతికదూరం పాటిస్తూ సురక్షితంగా ఉండండి. మీ అందరి క్షేమమే మీరు నాకు అందించే జన్మదిన కానుకగా భావిస్తాను" అని చంద్రబాబు పేర్కొన్నారు.