కరోనా ఆందోళనల నడుమ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

19-04-2021 Mon 16:38
  • దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా
  • తీవ్ర కుదుపులకు గురైన దేశీయ మార్కెట్లు
  • 800 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
  • 258 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
Stock Markets closes with loses amidst corona scares

ఏడాదిన్నర తర్వాత కరోనా మరోసారి పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు తీవ్రస్థాయిలో ఒడిదుడుకులకు గురయ్యాయి. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య రెండున్నర లక్షలకు పైగా నమోదవుతుండడం, అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకుంటుండడం, ఎక్కడికక్కడ ఆంక్షలు... సెన్సెక్స్, నిఫ్టీ లావాదేవీలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఓవరాల్ గా దేశం మొత్తం అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మార్కెట్లు కుదేలయ్యాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ 882 పాయింట్ల మేర నష్టపోయి 47,949.42 వద్ద ముగిసింది. ఓ దశలో 1,470 పాయింట్ల నష్టంతో కుప్పకూలిన సెన్సెక్స్ స్వల్పంగా పుంజుకున్నప్పటికీ నష్టాలతోనే ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 258 పాయింట్ల నష్టంతో 14,359.45 వద్ద స్థిరపడింది.

ఇవాళ్టి ట్రేడింగ్ లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బ్రిటానియా, సిప్లా, విప్రో, ఇన్ఫోసిస్ మెరుగైన ఫలితాలు అందుకోగా.... అదాని పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్ సర్వ్ నష్టాలు చవిచూశాయి.