జ‌గ‌న్ తాడేప‌ల్లి ప్యాలెస్ దాట‌డం లేదు: చంద్రబాబు విమర్శలు

19-04-2021 Mon 14:48
  • స‌చివాల‌య ఉద్యోగులు క‌రోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు
  • వారి కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి
  • జ‌గ‌న్ అల‌స‌త్వం వ‌ల్లే ఏపీలో క‌రోనా విల‌యతాండవం
  • ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాలి
chandrababu slams jagan

క‌రోనా బారిన ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌య ఉద్యోగులు వ‌రుస‌గా మృతి చెందుతుండ‌డం బాధాక‌ర‌మ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఉద్యోగుల సంర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఒకే వారంలో ముగ్గురు స‌చివాల‌య ఉద్యోగులు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయార‌ని ఆయ‌న చెప్పారు.

వారి కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని ఆయ‌న కోరారు. క‌రోనా విజృంభ‌ణ‌కు ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, ప్ర‌ణాళిక లోప‌మే కార‌ణ‌మ‌ని ఆయ‌న అన్నారు. ఉద్యోగుల ర‌క్ష‌ణ‌పై ప్ర‌భుత్వం దృష్టి పెట్ట‌ట్లేద‌ని, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తాడేప‌ల్లి ప్యాలెస్‌ను దాట‌డం లేద‌ని, ఉద్యోగులు మాత్రం విధుల‌కు హాజ‌రుకావాల్సిందేన‌ని ఆయ‌న చెబుతున్నార‌ని విమర్శించారు. అసలు జ‌గ‌న్ అల‌స‌త్వం వ‌ల్లే ఏపీలో క‌రోనా విల‌యతాండవం చేస్తోంద‌ని చంద్రబాబు ఆరోపించారు.

 ప్ర‌జ‌లు సుర‌క్షితంగా ఉండాల‌ని ఆయ‌న పేర్కొంటూ, కొన్ని  సూచ‌న‌లు చేశారు. గాలి, వెలుతురు బాగా ఉన్న బహిరంగ ప్రదేశాల్లో ఉండాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని సలహా ఇచ్చారు. ఇత‌రుల‌ను క‌ల‌వాల్సి వ‌స్తే వారితో అతి త‌క్కువ స‌మ‌యం మాత్ర‌మే గ‌డిపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచ‌న‌లు చేస్తూ ప్ర‌క‌ట‌న చేశారు.