గాసిప్స్ నమ్మవద్దు... విజయ్ దేవరకొండ-సుకుమార్ కాంబోలో చిత్రం పక్కా: ఫాల్కన్ క్రియేషన్స్

19-04-2021 Mon 14:26
  • విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో చిత్రం
  • గతేడాది ప్రకటించిన ఫాల్కన్ క్రియేషన్స్
  • పుకార్లు వస్తున్నాయని ఓ ప్రకటనలో వెల్లడి
  • తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని స్పష్టీకరణ
  • మరింత భారీస్థాయిలో చిత్రం ఉంటుందని వివరణ
Falcon Creations clarifies on combo with Vijay Devarakonda and Sukumar

యువ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో గతేడాది ఫాల్కన్ క్రియేషన్స్ చిత్ర నిర్మాణ సంస్థ ఓ సినిమా ప్రకటించింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాతగా రూపుదిద్దుకోబోయే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. అయితే, ఈ సినిమాపై తీవ్రస్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ ఫాల్కన్ క్రియేషన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసింది.

సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా కచ్చితంగా ప్రారంభం అవుతుందని, దీనికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ చిత్రం మరింత భారీ స్థాయిలో ఉంటుందని వివరించింది. ముందు నిర్ణయించిన ప్రణాళిక మేరకే ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని... విజయ్ దేవరకొండ, సుకుమార్ ఇప్పటికే అంగీకరించిన ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ చిత్రం షురూ అవుతుందని ఫాల్కన్ క్రియేషన్స్ తన ప్రకటనలో పేర్కొంది.

కొన్ని వర్గాలు ప్రచారం చేసే గాసిప్స్ ను తాము ఖండిస్తున్నామని వెల్లడించింది. తమ ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదని, తాము ఎంచుకున్న హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో ఎలాంటి మార్పు లేదని, మరింత భారీస్థాయిలో ఈ చిత్రం తెరకెక్కనుందని స్పష్టం చేసింది.